ఆంధ్ర – ఒడిషా సరిహద్దు వివాదం రోజురోజుకూ ముదురుతోంది. 5 నెలల క్రితం చోటుచేసుకున్న వివాదం తాజాగా దాడుల వరకు వచ్చింది. విశాఖ ఏజన్సీ డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్ పంచాయతీ, గసభ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లోకి ఒడిశావాసులు చొరబడడంతో న్యాయం చెయ్యాలని ఆంధ్రవాసులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిహద్దు వివాదంపై పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో ఒడిశావాసుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. చివరికి సర్వేకు వెళ్లిన అటవీ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. అరకు అటవీ శాఖ కు చెందిన 9 మంది సిబ్బంది గురువారం చైన్ సర్వే కు సరిహద్దుకు వెళ్లగా, అక్కడి ఒడిశా వాసులు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చిందని శుక్రవారం అటవీ శాఖకు చెందిన సెక్షన్ అధికారి భాస్కరరావు విలేకరులకు తెలిపారు. AP పోలీస్ బృందాలు ఉన్నాయన్న దైర్యంతో అక్కడికి వెళ్ళామని, తీరా అక్కడ పోలీసులు లేకపోవడంతో తమ సిబ్బందిపై ఒడిశావాసులు దాడి చేశారన్నారు. ఈ సంఘటనను తమ ఉన్నతధికారులకు తెలియపరిచమన్నారు. ఇప్పటికైనా ఏపి ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఆంధ్రవాసులపై దాడులు పెరిగి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భయందోళనలు వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన ఒడిశా వాసులపై కేసులు నమోదు చేయాలని గిరిజనసంఘం రాష్ట్ర నాయకుడు కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు.