కొడుకును కిడ్నప్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఓ తండ్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కోడెర్ మండలం రాజాపూర్ గ్రామంలో ఓ తండ్రి తన కొడుకును కిడ్నప్ చేశారంటూ గ్రామంలోని బస్టాండ్ దగ్గర నిరాహారదీక్ష చేపట్టారు. రాజపూర్ గ్రామానికి చెందిన బి. మహేష్ ను తన భార్య బంధువులు కిడ్నాప్ చేశారని మహేష్ తండ్రి వెంకటస్వామి, ఆయన సోదరుడు కురుమయ్య గ్రామస్థులతో కలిసి నిరాహారదీక్ష చేపట్టారు. మహేష్ కు వెన్నచర్లకు చెందిన దీపికతో 2019లో వివాహం అయింది. అప్పటి నుండి భార్యాభర్తలు, బంధువుల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. దాంతో రెండు కుటుంబాలు బ్రతుకుదెరువు కోసం భార్యాభర్తలను పట్నం పంపారు. అక్కడ కూడా గొడవలు పడుతుంటే మహేష్ భార్య దీపిక బంధువులు మహేష్ ను కొట్టి కిడ్నాప్ చేశారని మహేష్ కుటుంబీకులు ఆరోపిస్తూ హైద్రాబాద్ లోని పోలీస్ కమిషనర్, డీజీపీ కార్యాలయంలో పిర్యాదు చేశారు. దాదాపు సంవత్సరం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, దీపిక బంధువులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరాహారదీక్ష చేపట్టారు.