అధికార పార్టీలో అసహనం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వకండని పిలుపునిచ్చి వివాదం రేపారు. ఆ తరువాత యూ-టర్న్ తీసుకొని క్షమాపణ చెప్పినా గులాబీ పార్టీ మీద నెగిటివ్ ఇమేజ్ పడిపోయింది. ఆయన వ్యాఖ్యల ప్రభావం ఇంకా తొలగిపోక ముందే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమకు భద్రాచలంలో రాముడున్నాడని, మీ రాముడు ఎవనిగ్గావాలె, అయోధ్య గుడి తమకెందుకంటూ అసహనంగా వ్యాఖ్యానించారు. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా మాట తూలానని గుర్తించాడో ఏమో కానీ.. ఆ వెనుకే దేవుడంటే అందరికీ దేవుడేనని, బలుపును చూసి వాపు అనుకోవద్దని బీజేపీ నేతల మీద అసహనం వెళ్లగక్కారు. మొత్తానికి ఆలస్యంగా వెలుగుచూసిన ధర్మారెడ్డి వ్యాఖ్యలతో వరంగల్ జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ధర్మారెడ్డి దిష్టిబొమ్మలు తగులబెట్టారు.