కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు చెందిన కనకరాజును పద్మశ్రీ అవార్డు వరించింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కనకరాజు గుస్సాడీ నృత్యంతో దేశప్రజల్ని ఆకర్షించారు. అలాగే రాష్ట్రపతి అబ్దుల్ కలాం హయాంలో కూడా కనకరాజు మరోసారి తన గుస్సాడి నృత్యంతో ఢిల్లీ ఎర్రకోట పరేడ్ గ్రౌండ్స్ ను తన బృందంతో సుసంపన్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రజల ముందు ఆవిష్కరించి శెభాష్ అనిపించుకున్నారు. కనకరాజు జైనూరు మండలంలోని మర్లవాయి గ్రామానికి చెందినవారు. తాజాగా నరేంద్రమోడీ ప్రధానిగా కేంద్రం ప్రభుత్వం కనకరాజును పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేయడంతో మర్లవాయి గ్రామస్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గ్రామస్తులు, అభిమానులు, ఆదివాసీ నేతలు కనకరాజును ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, హైమాన్ డార్ఫ్ యూత్ సభ్యులు కనకరాజును సన్మానించారు.