ఎటువంటి బిల్లు లేని సుమారు కేజీ బంగారు ఆభరణాలను కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని వినాయకుడి గుడి సమీపంలో షేక్ రహమాన్, మైలవరపు రాజేష్ లు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై ఉండటంతో తనిఖీలు నిర్వహించిన ఎస్సైలు రంగనాథ్, లక్ష్మి ఎటువంటి బిల్లులు అనుమతి పత్రాలు లేని సుమారు కేజీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రహమాన్, రాజేష్, గంపలగూడెం నుండి కంచికచర్ల పరిసర ప్రాంతాలలో బంగారం షాపులకు బంగారం ఆభరణాలు విక్రయించేందుకు వచ్చారని నందిగామ రూరల్ సీఐ కె.సతీష్ కంచికచర్ల పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. కేజీ బంగారు ఆభరణాలతో పాటు 81 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేశారు.