రాష్ట్రంలో పోలీసుల తీరుపై ఎపి బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అర్ధరాత్రి ఇళ్ళకు వచ్చి తలుపులు బాదుతారా… దొంగలమా, దోపిడీదారులమా.. మేము అసలు ఇంట్లో ఉండాలా వద్దా అంటూ పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ లకు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే అవకాశం రాష్ట్రంలో లేదా.. అవాస్తవాలను చెప్పిన డీజీపీని కలిసి మనోభావాలు వివరించే హక్కు కూడా ఉండదా అంటూ సోము వీర్రాజు పోలిసులపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల పర్యటలను అడ్డుకోవడంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామంటున్నారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాల పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ.. బీజేపీ పోరాటాన్ని ఉధృతం చేసింది.. ఫిబ్రవరి నాలుగో తేదీన కపిల తీర్ధం నుంచి రామ తీర్దం వరకు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇఫ్పటికే పోలీసుల అనుమతి కోరుతూ రూట్ మ్యాప్ ఇచ్చామని, ప్రభుత్వం ఒత్తిడితో అనుమతి నిరాకరిస్తే.. కార్యాచరణ కూడా ప్రకటిస్తామంటున్నారు. అయితే ఇటీవల డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆలయాలపై దాడుల విషయంలో రాజకీయ కోణం లేదంటూ తొలుత ప్రకటించిన డీజీపీ .. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ కార్యకర్తల హస్తం ఉందని ప్రకటించారు. అయితే.. బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందని ఏ ఆధారంతో డీజీపీ చెప్పారో వివరణ ఇవ్వాలని, లేదా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.. దీనికి సంబంధించి ఈనెల 20వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కార్యాచరణ ఉంటుందని చెప్పారు.. అయితే గడువు పూర్తి కావడంతో.. డీజీపీకార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని బీజేపీ నేతలు భావించారు.. ఇందుకోసం.. ముందురోజే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ విజయవాడ చేరుకున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి.. బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు.. ఇక శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎంపీ సీఎం రమేష్ రాకపై కూడా అభ్యంతరం తెలిపారు.. దీనిపై వాదన జరగడంతో.. చివరకు విజయవాడలోని బీజేపీ పార్టీ కార్యాలయం వరకు రానిచ్చారు.. అయితే ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నాయకులు సూర్యనారాయణ రాజు, బాల, అడ్డూరి శ్రీరామ్ వంటి నాయకులు మంగళగిరి వైపు నుంచి డీజీపీ కార్యాలయం వైపుకు దూసుకొచ్చారు.. దీంతో జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. మరోవైపు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ రమేష్ లను పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ.. పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఇంటి వరకు పంపారు… రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను అధ్యక్షులకు వివరించారు.. దీంతో ఆయన తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో సోము వీర్రాజుకు ఆగ్రహం కట్టం తెంచుకుంది.. ఒక్కసారిగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అర్ధరాత్రులు ఇళ్లకు వచ్చి తలుపులు కొడతారా.. చుట్టూ ఉన్న వాళ్లు ఏమనుకోవాలి.. అద్దె ఇంట్లో నేను ఉండాలా వద్దా అంటూ మండిపడ్డారు. డీజీపీ చేసిన ప్రకటనపై ఒక రాజకీయ పార్టీగా వివరణ కోరే అవకాశం కూడా తమకు లేదా.. ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో పోలీసులు తీరు పై కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేస్తామని, అదే విధంగా డీజీపీ చేసిన ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.