పాలిచ్చి పోషించేది తల్లి. అదే మాతృత్వం. అలాంటి మాతృత్వానికి జాతి భేదాలేంటి? ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పాత బస్టాండ్ దగ్గర అలాంటి ఓ అరుదైన వింత సంఘటన చోటు చేసుకుంది. మాతృ ప్రేమకు జాతిభేదం లేదని నిరూపించింది ఓ శునకం . ఆకలితో నకనకలాడుతూ తల్లిపాల కోసం ఆరాటపడుతున్న పందిపిల్లలకు మాతృ శునకం కనిపించింది. వెంటనే ఆ పందిపిల్లలు శునకం పొదుగుకు ఎగబడి ఆబగా పొడిచి పొడిచి పాలు తాగాయి. ఆకలి తీర్చుకున్నాయి. అటు కుక్క కూడా పందిపిల్లలను ఏమీ అనలేదు. అవి పాలు తాగడానికి పూర్తిగా సహకరించి తనలోని మాతృత్వాన్ని చాటుకుంది. ఇలాంటి సన్నివేశాన్ని ఇప్పటివరకు టీవీల్లో చూడడమే తప్ప నేరుగా చూడలేదని స్థానికులు ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు.